హైదరాబాద్ నగరంలోని బుద్ధభవన్ (Buddha Bhavan) సెకండ్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక హైడ్రా పోలీస్ స్టేషన్ (HYDRAA Police Station) ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ (Ranganath IPS) సీఎంకు హృదయపూర్వక స్వాగతం పలికారు. సీఎం రేవంత్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న సాంకేతిక వసతులను పరిశీలించారు. హైడ్రా అధికారుల కోసం ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 55 మహీంద్రా స్కార్పియోలు (Scorpios), 21 ట్రక్కులు (Trucks), 4 ఇన్నోవాలు (Innovas) మరియు అనేక ద్విచక్ర వాహనాలు సేవలోకి తీసుకువచ్చారు. వీటన్నీ హైడ్రా పరిధిలో భద్రతను బలోపేతం చేయడంలో, వేగవంతమైన స్పందన కల్పించడంలో కీలకంగా ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ IPS మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఉద్దేశాలను ప్రతిబింబించే విధంగా HYDRAA వ్యవస్థ నిబద్ధతతో ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. గత తొమ్మిదిన్నర నెలలుగా హైడ్రా ఒక ప్రజానుకూల సంస్థగా మారిందన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ (Irrigation), రెవెన్యూ (Revenue), మున్సిపల్ (Municipal), పోలీస్ (Police) శాఖల అధికారాలను సమన్వయం చేయడంలో ఈ స్టేషన్ కీలకంగా పనిచేస్తోందన్నారు. “ఇది కేవలం ఆస్తుల పరిరక్షణకు మాత్రమే కాకుండా, విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందన (Disaster Response) కల్పించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది” అని తెలిపారు.