అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఉదయం 10:30కి ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మార్కాపురానికి చేరుకుంటారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, లబ్ధిదారులకు పథకాల పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలతో ముఖాముఖి భేటీ అవుతారు.
డ్వాక్రా మహిళలకు కొత్త పథకం ప్రకటించే అవకాశం
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై, వారి అభివృద్ధికి సంబంధించి కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. మహిళా దినోత్సవ వేడుకల అనంతరం కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 4:30కి మార్కాపురం నుంచి బయలుదేరి, తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.








