18 నెలల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన చేసి చూపించామని, సూపర్ సిక్స్ (Super Six) ను సూపర్ హిట్(Super Hit) చేసేశామని ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏలూరు (Eluru) జిల్లా నల్లమాడులో పెన్షన్‌ల పంపిణీ (Pensions Distribution) అనంతరం ప్రజావేదికలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మార్పులు వస్తున్నప్పటికీ, రైతులు వ్యవసాయ పద్ధతులు మార్చుకోకపోతే ప్రభుత్వం ఆదుకోదని ఆధునిక వ్యవసాయాన్ని అలవరుచుకోవాలని సూచించారు.
ఉద్యోగాల విషయానికి వస్తే, 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీపై చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులోనే 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించగా, మొత్తం ఇప్పటివరకు 8.80 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ఇవి కలిపి రాష్ట్ర యువతకు 24 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని అది తమ ప్రభుత్వ గ్యారంటీ అని స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణంపై మాట్లాడిన సీఎం, 2028 నాటికి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. “అభివృద్ధి జరిగితేనే భూముల ధరలు పెరుగుతాయి. ఒకప్పుడు కోకాపేటలో ఎకరం 10,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు అది 170 కోట్లకు పెరిగింది. అలాంటి రోజులు ఏపీలో కూడా వస్తాయి” అంటూ వ్యాఖ్యానించారు.
ఎయిడ్స్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శమైందని, 1995లో ఎవ్వరూ మాట్లాడని సమయంలో తానే ముందుకు వచ్చి సమాజానికి అవగాహన కల్పించానని చెప్పారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లే రాబోయే 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కొనసాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.








