విరుచుకుపడ్డ క్రిస్ లిన్.. 27 బంతుల్లోనే 81 పరుగులు!

విరుచుకుపడ్డ క్రిస్ లిన్.. 27 బంతుల్లోనే 81 పరుగులు!

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (World Championship Of)-2025 (WCL 2025) లో ఆస్ట్రేలియా (Australia) ఓపెనర్ క్రిస్ లిన్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్, ఆ తర్వాత సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ పూర్తైన అనంతరం మరో ఏడు బంతులు ఎదుర్కొన్న క్రిస్ లిన్ (Chris Lynn) ఏకంగా 31 పరుగులు రాబట్టాడు.

27 బంతుల్లోనే 81 పరుగులు
35 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్ మొత్తంగా 27 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు. ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 300 స్ట్రైక్‌రేటుతో ఈ మేర పరుగులు సాధించాడు. క్రిస్ లిన్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

WCL-2025లో భాగంగా బుధవారం రాత్రి ఆసీస్- విండీస్ (AUSCH vs WICH) జట్లు తలపడ్డాయి. నార్తాంప్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

గేల్ మరోసారి విఫలం
ఓపెనర్ డ్వేన్ స్మిత్ (22), లెండిల్ సిమ్మన్స్ (29), డ్వేన్ బ్రావో (26) ఫర్వాలేదనిపించగా, కెప్టెన్ క్రిస్ గేల్ (21) మరోసారి తన స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు.

ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడెల్ మూడు వికెట్లు కూల్చగా, కౌల్టర్-నైల్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ బ్రెట్ లీ, స్టీవ్ ఒకెఫె, ఆర్సీ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఛాంపియన్స్ ఆరంభంలోనే షాన్ మార్ష్ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.

బెన్ డకెట్ మెరుపు ఇన్నింగ్స్
అయితే, మరో ఓపెనర్ క్రిస్ లిన్ (27 బంతుల్లో 81) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. నికిత మిల్లర్ బౌలింగ్‌లో షెల్డన్ కాట్రెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో లిన్ ఆటకు తెరపడింది. ఈ క్రమంలో డీ ఆర్సీ షార్ట్ (12 బంతుల్లో 18) వేగంగా ఆడగా, వికెట్ కీపర్ బెన్ డకెట్ మెరుపు ఇన్నింగ్స్ (9 బంతుల్లో 30)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆసీస్ కేవలం 9.3 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ విజయంతో ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను చిత్తు చేసిన ఆసీస్, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఈ మెగా టోర్నీ 2024లో మొదలుకాగా, యువరాజ్ సింగ్ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ అరంగేట్ర సీజన్ విజేతగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment