చిరంజీవి (Chiranjeevi)… ఈ పేరు చెబితేనే ఒక వైబ్రేషన్, ఒక ప్రత్యేకమైన ఆరా, ఒక ఇమేజ్ ప్రతిధ్వనిస్తాయి. 45 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మెగాస్టార్ ఆయన. అలాంటి నటుడితో సినిమా చేయాలని ఎంతో మంది దర్శకులు కలలు కంటారు. ఇప్పుడు అదే మెగాస్టార్ ‘నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారతా’ అని ప్రకటించడం టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది. ఆయనకు ఇది చిన్న మాటే కావచ్చు, కానీ నిజంగా ఆయనను సపోర్టింగ్ రోల్స్ (Supporting Roles)లో చూపించేంత సత్తా మన దర్శకులకు ఉందా అనేది పెద్ద ప్రశ్న.
సీనియర్ హీరోల పాత్రల మార్పు
“సీనియర్ హీరోలు ఇంకెన్నాళ్లు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుతారు? వయసుకు తగ్గ పాత్రలు చేయాలి కదా?” అనే డిమాండ్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు విభిన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. నాగార్జున (Nagarjuna) కూడా ‘కుబేర’ ‘(Kubera’)లో సపోర్టింగ్ రోల్ చేయగా, ‘కూలీ’లో విలన్‌గా నటిస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని నాగార్జున కూడా దర్శకులకు స్పష్టం చేశారు.
చిరు ఇచ్చిన “మెగా ఆఫర్” ఒక సవాల్!
నాగార్జున (Nagarjuna) లాంటి హీరోలు సపోర్టింగ్ రోల్స్ చేయడం ఒకెత్తు. కానీ, చిరంజీవిని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చూపించడం అంత తేలికైన విషయం కాదు. చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయేలా, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆయనను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మార్చే కథలను మన దర్శకులు రాయగలరా? ఈ “మెగా ఆఫర్”ను స్వీకరించే ధైర్యం, సృజనాత్మకత టాలీవుడ్లో ఎవరికి ఉంది?
చిరంజీవి కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా, కథ నచ్చితే OTTలో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇది ఆయనకు చిన్న మాటే అయినా, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం దర్శకులకు చాలా పెద్ద రిస్క్. మెగాస్టార్‌తో సపోర్టింగ్ రోల్ చేయించాలంటే ఆ కథకు ఎంతటి బలమైన కథా నేపథ్యం, ఎంతటి స్థాయి ఉండాలి?
దర్శకులపైనే బాధ్యత
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల పాత్రల విషయంలో మార్పు మొదలైంది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పును స్వాగతించి, వారి ఇమేజ్‌కు సరిపోయే కథలను రాసే బాధ్యత మాత్రం దర్శకులపైనే ఉంది. చిరంజీవి ఇచ్చిన ఈ సవాల్‌ను స్వీకరించి, మెగాస్టార్‌ను సరికొత్త పాత్రలో చూపించే ఆ ధైర్యం ఏ దర్శకుడికి ఉందో వేచి చూడాలి.