మద్యం అక్రమ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. 225 రోజుల పాటు జైలు జీవితం గడిపిన చెవిరెడ్డికి ఏపీ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేశ్‌నాయుడికి కూడా హైకోర్టు బెయిల్ ఇస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో సిట్ అధికారులు ఏడు నెలల క్రితం వీరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటూ వస్తున్నారు.
లిక్కర్ అనే అంశానికే తాను దూరమని, రాజకీయ కక్షతోనే అన్యాయంగా ఈ కేసులో తనను ఇరికించారని కోర్టు ఆవరణలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పలుమార్లు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన స్పష్టం చేస్తూ వచ్చారు. చివరకు ఏడు నెలల తర్వాత ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి ప్రతాప్ కీలక తీర్పును వెలువరించారు. ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చెవిరెడ్డి జైలు నుంచి విడుదలయ్యే మార్గం సుగమమైంది.
తిరుమల లడ్డూలో జంతుకొవ్వు ఆనవాళ్లు లేవని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ తేల్చిచెప్పడం, ఇటీవల మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు బెయిల్ మంజూరు కావడం, తాజాగా చెవిరెడ్డికి బెయిల్ లభించడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. మద్యం కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కృప వల్లే తన తండ్రికి న్యాయం జరిగిందని చెవిరెడ్డి కుమారుడు మోక్షిత్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.








