ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రితో భేటీ అయిన సీఎం, వినతిపత్రం సమర్పించారు. తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రారంభించిన పూర్వోదయ పథకంలో ఇప్పటికే బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపికైనట్లు ఆయన గుర్తుచేశారు.
ఈ పథక నిధులతో రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించే ప్రాజెక్టులు అమలు చేయాలని సీఎం వివరించారు. వీటికి పూర్వోదయ నిధులు లభిస్తే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆర్థిక అవకాశాలను పెంపొందించేందుకు ఈ పథకం కీలకమని పేర్కొన్నారు.
అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు చర్చించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమని, దానిని త్వరగా పూర్తిచేయడానికి కేంద్ర సహకారం అవసరమని వివరించారు. పూర్వోదయ పథకం ద్వారా ఎక్కువ నిధులు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక దృశ్యపటంలో స్పష్టమైన మార్పు వస్తుందన్నారు సీఎం.








