ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Development Scam Case)ను క్లోజ్ చేయడంపై నేడు ఏసీబీ కోర్టు (ACB Court)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ (Mistake of Fact)గా పేర్కొంటూ క్లోజ్ చేసిన నిర్ణయంపై ప్రముఖ న్యాయవాది, జై భీమ్ పార్టీ (Jai Bhim Party) వ్యవస్థాపకులు జడ శ్రవణ్ (Jada Shravan) దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి.
గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి 70 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అదే సమయంలో రిమాండ్ రిపోర్టుతో పాటు 48 కీలక డాక్యుమెంట్లను సీఐడీ ఏసీబీ కోర్టుకు సమర్పించింది. అయితే ఆ తర్వాత ఈ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పేర్కొంటూ ఏసీబీ కోర్టు క్లోజ్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
చంద్రబాబు స్కిల్ కేసు క్లోజింగ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జడ శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్తో పాటు క్లోజింగ్ ఆర్డర్ కాపీలు ఇవ్వాలంటూ ఆయన కోర్టును కోరారు. అయితే ముందుగా కింది కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించడంతో, జడ శ్రవణ్ తిరిగి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
12వ తేదీన క్లోజింగ్ రిపోర్ట్‌ను ఏసీబీ కోర్టులో సమర్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించడంతో, మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు నేడు ఏసీబీ కోర్టులో జడ శ్రవణ్ తన వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును క్లోజ్ చేయడం చట్టబద్ధమా? రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్న అంశాలను విస్మరించారా? అన్న అంశాలపై న్యాయవాదనలు తీవ్రంగా సాగాయి. ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో, ఈ కీలక వ్యవహారంపై ఏసీబీ కోర్టు ఫిబ్రవరి 3న తుది ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.








