ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి కోసం కేంద్రం (Central Government) నుంచి ఆర్థిక సహాయం (Financial Assistance) అవసరమని ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి ప్రాధాన్యతలు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, ఆర్థిక అవసరాలపై పలు విజ్ఞప్తులు చేశారు. ఇప్పటి వరకు ఏపికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం పథకం కింద రూ.2,010 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న మూలధన ప్రాజెక్టులకు అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
సింగిల్ నోడల్ ఏజెన్సీ పథకం
సింగిల్ నోడల్ ఏజెన్సీ (Single Nodal Agency) ప్రోత్సాహక పథకం (Incentive Scheme) మార్గదర్శకాల ప్రకారం రూ.250 కోట్ల విడుదలకు సంబంధించి ఏపీ ప్రతిపాదనలు పరిశీలించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని ఆయన అన్నారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పూర్వోదయ పథకం విషయంలో కూడా కేంద్రం వెంటనే విధివిధానాలు రూపొందించాలని సీఎం కోరారు. దీన్ని త్వరగా అమల్లోకి తెచ్చి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చంద్రబాబు అభ్యర్థనలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.