మొన్న లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తల చేత డిమాండ్.. నిన్న అసెంబ్లీ, మండలి సమావేశాలలో నారా లోకేష్‌ను మీడియాలో హైప్ చేసిన విధానం.. సంబంధం లేని శాఖల్లోకి ఎంటరై చినబాబు చేస్తున్న హంగామా.. ప్రతి అంశంలోకి చొరబడి చేస్తున్న హడావుడి.. వీటన్నింటికీ జవాబు దొరికింది.. త్వరలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రిటైర్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.. దగ్గుబాటి పుస్కకావిష్కరణ కార్యక్రమంలో రిటైర్మెంట్‌పై కామెంట్స్ చేశారు. తాజా పరిణామాలన్నీ నిశితంగా పరిశీలిస్తే లోకేశ్‌ను తన స్థానంలో పెట్టేందుకే బాబు పడే ప్రయాసలన్నీ కళ్లకు కట్టినట్లుగా అర్థమవుతాయి.
మొన్నటి వరకు ఉప్పు-నిప్పులా ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి అల్లుళ్లు నిన్న ఒకే వేదికను పంచుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కర విశాఖలోని బాలకృష్ణ చిన్నల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గురించి ప్రస్తావిస్తూనే తన మనసులో మాటను చంద్రబాబు బయటపెట్టారు. బిజీగా ఉండే దగ్గుబాటి రిటైర్మెంట్ జీవితం ఎలా గడుపుతున్నారో తెలుసుకున్నాను.. నేను కూడా రిటైర్మెంట్ కి ప్రిపేర్ కావలి కదా..అందుకే తెలుసుకున్నాను అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు త్వరలో రిటైర్ కాబోతున్నారని, చినబాబుకు పగ్గాలు అప్పగించే సమయం ఆసన్నమైందన్న అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నాయి.
రిటైర్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొనే ఇటీవల చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారని, టీడీపీ అనుకూల మీడియాతో చినబాబును జాకీలు పెట్టి లేపుతున్నారని, సంబంధం లేని శాఖల ప్రతికా ప్రకటనల్లోనూ లోకేశ్ బొమ్మను ప్రచురిస్తున్నారనే మాటలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. చినబాబు లోకేశ్‌ను పార్టీపై, ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నాన్ని ఆ పార్టీలోని పలువురు సీనియర్లు తప్పుబడుతున్నారని సమాచారం. కుమారుడి మీదున్న ప్రేమా, వాత్సల్యంతో సీఎం కుర్చీని ఎక్కిస్తే.. పొత్తులో ఉన్న పవన్ ఊరుకుంటారా..? ఆయన అభిమానులు మిన్నకుండిపోతారా..? అనేది ప్రశ్న.