విడాకుల అంశం (Divorce Issue)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లోనే కాదు… రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి తర్వాత విడాకుల ప్రస్తావన రాకూడదని, అది హిందూ సంప్రదాయం (Hindu Tradition), భారతీయ సంస్కృతి (Indian Culture) అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ (Jana Sena Party)లో ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
భారతీయ సంప్రదాయాలు, వివాహ వ్యవస్థ వంటి సున్నితమైన అంశాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే విడాకుల ప్రస్తావన రావడంతో ప్రతిపక్ష వైసీపీ(YSRCP) శ్రేణులతో పాటు కూటమిలో జనసేన పార్టీ అంటే గిట్టనివారు, బాలయ్య ఫ్యాన్స్ (Balakrishna Fans) ఈ అంశాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు వ్యాఖ్యల వీడియోలను విస్తృతంగా వైరల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీని వెనకున్న రాజకీయ నేపథ్యం అందరికీ తెలిసిందే.
చంద్రబాబు చేసిన విడాకుల వ్యాఖ్యలు కూటమిలో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిగత జీవితాన్ని లింక్ చేస్తూ విమర్శలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ మూడు వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. తనకు వివాహాలు కలిసి రాలేదని పవన్ స్వయంగా భావోద్వేగంగా చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. అంతేకాదు, చట్టపరమైన విడాకులు తీసుకుని, భరణం చెల్లించిన తర్వాతే తదుపరి వివాహం చేసుకున్నట్లు ఆయన ఇప్పటికే స్పష్టీకరణ ఇచ్చారు.
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు నేరుగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినట్లుగా కనిపిస్తున్నాయంటూ వైసీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు సెటైర్లు వేస్తున్నారు. “పొత్తులో ఉన్నప్పుడు ఇలాంటి రాళ్ల దెబ్బలు తప్పవు సైనికులారా… మరో 15 ఏళ్లు భరించాల్సిందే” అంటూ వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో కూటమిలో అంతర్గత విభేదం పెరుగుతోందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఊపందుకుంటోంది.








