అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రస్తుతమున్న ఉద్యోగాలనే ఊడబెరుకుతోంది. కూటమి ప్రభుత్వ చర్యతో సంచార పశువైద్య సిబ్బంది రోడ్డున పడ్డారు. ఒకేసారి 670 మంది సంచార పశువైద్య సిబ్బందిని తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉపాధి కరువై రోడ్డున పడ్డ సిబ్బంది ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.
విజయవాడ గొల్లపూడి ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగం కోల్పోయిన సంచార పశువైద్య సిబ్బంది సోమవారం నిరసన వ్యక్తం చేశారు. తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా ఒక్కరోజు ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం వల్లనే తొలగించామని జీవీకే సిబ్బంది చెబుతున్నా.. ఉద్యోగులు మాత్రం తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తొలగించిన ఉద్యోగులు డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే రూ.10 వేల జీతం అందిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు వాలంటీర్లకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్లకు ఉపాధినే దూరం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం తీసేసింది. అదే విధంగా ఏపీ ఫైబర్ నెట్‌లో ఉద్యోగం చేస్తున్న 410 మందిని ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు కల్పించకుండా, ఉన్న ఉద్యోగాలనే ఊడబెరుకుతున్న కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.