కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది గడుస్తున్నా.. సినిమా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఏపీ సీఎంను కలవలేదన్న డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలతో టాలీవుడ్ పెద్దలంతా ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమయ్యారు. నేడు చంద్రబాబు నాయుడితో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల సమావేశం అనూహ్యంగా ముందుకు జరిగింది.. ఈ నెల 22వ తేదీన జరగాల్సిన ఈ భేటీని రేపు (జూన్ 15) సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మార్పునకు కారణం డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపటి నుంచి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనుండటమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీని ముందుకు జరిపి, రేపు నిర్వహించాలని నిర్ణయించారు.
రేపు సాయంత్రం జరిగే ఈ సమావేశానికి ముందు, సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమై, పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలిసి, తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలపై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా షూటింగ్‌లకు అనుమతులు, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, టికెట్ ధరల నియంత్రణ, థియేటర్ నిర్వహణ వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. దాదాపు 30 మంది సినీ ప్రముఖులు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. ఈ సమావేశం ద్వారా పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించి, రాష్ట్రంలో సినీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని భావిస్తున్నారు. ఈ భేటీ ఫలితాలపై సినీ పరిశ్రమతో పాటు రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.