2014-19 మధ్య చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలపై నమోదైన కేసులను రాష్ట్రం వెలుపల విచారణ చేస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల ప్రజాధనం కొట్టారని నమోదైన కేసుల విచారణలో ఆధారాలు సైతం బయటపడ్డాయన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్థనరెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాకాణి గోవర్ధన్ ఇంకా ఏమన్నారంటే.. సీఎం హోదాలో తనపైన గతంలో నమోదైన అవినీతి కేసులను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. గతంలో ఈ కేసులను నిస్పక్షపాతంగా విచారించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన అధికారులపై నేడు సీఎంగా చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కామ్‌ల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనంను దోచుకున్నాడన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డాడని, దీనిపై వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పలు అక్రమాలు ఏపీ సీఐడీ, అలాగే కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్లు వెలుగులోకి తీసుకువచ్చాయన్నారు. ఈ కేసుల్లో కొన్నింటిపైన న్యాయస్థానాల్లో ఇప్పటికే చార్జిషీట్ లు దాఖలయ్యాయి. మరికొన్నింటిపైన సమగ్ర ఆధారాలతో చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉందన్నారు.
స్కిల్ స్కామ్, అమరావతి భూదోపిడీ..
పూణే, ముంబై, ఢిల్లీలో ఈడీ సోదాలు చేసి రూ. 332 కోట్ల షెల్ కంపెనీల మార్గంలో చంద్రబాబుకు చేరినట్లు ఆధారాలు లభించాయని కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. అనేక అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయన ఒత్తిడి తెచ్చి నిధులను షెల్ కంపెనీలకు మళ్లించారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ పేరిట భూదోపిడీ జరిగిందని, చంద్రబాబు నాయుడు, నారాయణ ఈ స్కామ్‌లో కీలక నిందితులుగా ఉన్నారని కాకాణి పేర్కొన్నారు.
కేసుల నుంచి తప్పించుకునేందుకు..
గతంలో తనపైన నమోదైన కేసులను నిర్వీర్యం చేస్తూ, వాటి నుంచి తప్పించుకునేందుకు, ఆ కేసుల్లో ఎక్కడ శిక్ష పడుతుందోనన్న భయంతో ఆధారాలను చంద్రబాబు రూపుమాపేందుకు యత్నిస్తున్నాడని, దీనికోసం ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని ఆనాడు విచారణాధికారులుగా ఉన్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. చంద్రబాబు జైలు నుండి విడుదల సమయంలో కోర్టుకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి బెయిల్‌ను దుర్వినియోగం చేస్తున్నారని కాకాని గోవర్థనరెడ్డి ఆరోపించారు.