భారత్-పాక్ (India-Pakistan) మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) అలర్ట్ అయ్యింది. పహల్గామ్‌లో అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తో దీటైన జావాబిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని మీడియా ఛానళ్లకు (Media Channels) కీలక సూచనలు జారీ చేసింది.
భారత రక్షణ (Indian defense), భద్రతా దళాల (Security Forces) కదలికలను ప్రత్యక్ష ప్రసారం (Live Broadcast) చేయకుండా ఉండాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని మీడియా ఛానళ్లకు మౌలిక సూత్రాలు, నిబంధనలు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్ ఫామ్స్, వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా ఉపయోగించేవారు, రక్షణ మరియు ఇతర భద్రతా కార్యకలాపాల గురించి ప్రసారం చేసేటప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ప్రస్తుత చట్టాలను, నిబంధనలను విధిగా పాటించాలని ఆదేశించింది.
ప్రత్యేకించి రక్షణ కార్యకలాపాలు లేదా భద్రతా దళాల కదలికలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం, సంబంధిత దృశ్యాలను లేదా సంబంధించి సేకరించిన సమాచారంతో కూడిన వార్తా కథనాలు ప్రసారం చేయకూడదని కోరింది. సున్నితమైన సమాచారాన్ని ముందస్తుగా తెలియపరచడం ద్వారా శత్రు శక్తులకు సహకరించినట్లు అవుతుందని తద్వారా వారి కార్యకలాపాల సమర్థత, సిబ్బంది భద్రతకు ముప్పు కలుగుతుందని తెలిపింది.
గతంలో కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడులు (26/11), కాందహార్ హైజాక్ వంటి సందర్భాల్లో, ఎటువంటి ఆంక్షలు లేని ప్రసారాల వల్ల జాతీయ ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావాలను కలిగించాయని కేంద్రం గుర్తుచేసింది. మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించి దేశ ప్రయోజనాలను పరిరక్షించాలని సూచించింది. మీడియా కవరేజ్ సంబంధిత ప్రభుత్వం నియమించిన అధికారి అందించే సమాచారానికే పరిమితం కావాలని, ఆ కార్యాచరణ పూర్తయ్యే వరకు ఇదే పద్ధతి పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. దేశ, సైనికుల భద్రత దృష్ట్యా అన్ని టీవీ ఛానళ్లు ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ, భద్రతా దళాల కదలికల ప్రత్యక్ష ప్రసారాన్ని చేయకుండా ఉండాలని కేంద్రం సూచించింది. మీడియా ప్రసారాల్లో అప్రమత్తంగా ఉంటూనే, సున్నితత్వం, బాధ్యతను కొనసాగించాలని, దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని కోరింది.







