2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అమలైన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా ప్రస్తావన రావడం గమనార్హం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలు, వ్యవసాయ రంగంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది.
2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన సంస్కరణలను కేంద్రం కొనియాడింది. రైతుల భూహక్కుల పరిరక్షణకు తీసుకొచ్చిన సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని దేశంలోనే ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొంది. ఏపీ ప్రభుత్వం 2021లో ప్రారంభించిన రీ సర్వే కార్యక్రమంలో ఆధునిక డ్రోన్ టెక్నాలజీ, జీఐఎస్ (GIS) వ్యవస్థను వినియోగించింది. ఈ ప్రక్రియ ద్వారా ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్‌ను రైతులకు అందించింది. దీంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించిందని కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.
కేంద్ర ఆర్థిక సర్వే వివరాల ప్రకారం 2025 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 6,801 గ్రామాల్లో సమగ్ర భూ రీ సర్వే పూర్తయింది. మొత్తం 81 లక్షల భూములకు సంబంధించి రీ సర్వే జరగగా, దాదాపు 86 వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ఇది దేశంలోనే ఒక అరుదైన ఘనతగా కేంద్రం పేర్కొంది.
భూహక్కు–భూరక్ష పథకం మహాయజ్ఞం: వైఎస్ జగన్
ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వం చేపట్టిన భూహక్కు–భూరక్ష పథకాన్ని ఒక మహాయజ్ఞంగా అభివర్ణించారు. విదేశాల్లో అమలులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, బ్రిటిష్ పాలన తర్వాత వందేళ్లకు ఇలాంటి సమగ్ర భూ రీ సర్వేను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
క్రెడిట్ చోరీపై వైసీపీ ఆరోపణలు
తాము చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని వైసీపీ ఆరోపిస్తోంది. రైతులకు ఇచ్చిన పాస్‌పుస్తకాల రంగులు మార్చి రీ సర్వే క్రెడిట్‌ను తామే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తోంది. అలాగే, సమగ్రంగా రీ సర్వే పూర్తిచేసిన జగన్ ప్రభుత్వానికి కేంద్రం గ్రాంట్‌గా విడుదల చేసిన రూ.400 కోట్లను కూడా తమ విజయంగా చెప్పుకుంటోందని వైఎస్ జగన్ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వచ్చిన ప్రశంసలతో సమగ్ర భూ రీ సర్వే ఘనత పూర్తిగా వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని మరోసారి స్పష్టమైంది. ఆధునిక సాంకేతికతతో రైతులకు భద్రత కల్పించిన ఈ సంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా నిలిపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








