భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన అడుగు పడబోతోంది. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర క్యాబినెట్ సమావేశం పలు సంచలన నిర్ణయాలకు వేదిక కానుంది. ప్రధానంగా మహిళా రిజర్వేషన్లు, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచే రాజ్యాంగ సవరణ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
816కు చేరనున్న లోక్సభ స్థానాలు
ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం, ప్రస్తుతమున్న లోక్సభ స్థానాలను భారీగా పెంచనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు బిల్లు ద్వారా లోక్సభ స్థానాల సంఖ్య 816కి చేరే అవకాశం ఉంది. ఇందులో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా 273 స్థానాలు మహిళలకు కేటాయించబడతాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న అసెంబ్లీ సీట్లు
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 179కి చేరే ఛాన్స్ ఉంది.
2029 నుంచే అమలు.. రాజ్యాంగ సవరణలు
2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 55, 81, 82, 170, 330, 332లకు సవరణలు ప్రతిపాదించనున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పెరిగిన సీట్లు, మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది.
ఏకాభిప్రాయం కోసం కసరత్తు
ఈ కీలక బిల్లులపై ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే మిత్రపక్షాలు, విపక్ష నేతలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇండియా (INDIA) బ్లాక్ నేతలతో సమావేశమై ప్రతిపక్షాల వ్యూహాన్ని చర్చిస్తున్నారు. అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను పొడిగించి అయినా సరే ఈ రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదం పొందాలని కేంద్రం పట్టుదలగా ఉంది.








