తమిళనాడులో గతేడాది సంచలనం సృష్టించిన కరూర్ (Karur) తొక్కిసలాట ఘటన మరో కీలక దశకు చేరుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) తాజాగా తమిళ వెట్రి కళగం (Tamil Vetri Kazhagam – TVK) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay)కి నోటీసులు జారీ చేసింది. సీబీఐ అధికారులు పంపిన నోటీసుల్లో, విజయ్ ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ను విచారించే అవకాశమున్నట్లుగా సమచారం. ఈ పరిణామం తమిళ రాజకీయాలు, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ జిల్లా వేలుసామిపురం (Velusamipuram)లో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో దళపతి విజయ్ను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రారంభంలో ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలనే డిమాండ్లు పెద్దఎత్తున వెల్లువెత్తాయి.
సుప్రీంకోర్టు జోక్యం.. CBIకి కేసు బదిలీ
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు (Supreme Court of India) జోక్యం చేసుకుని, గతేడాది అక్టోబర్‌లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అంతేకాదు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి (Justice Ajay Rastogi) నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు విజయ్‌కు నోటీసులు జారీ కావడంతో, ఈ కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








