విద్యుత్ చార్జీల పెంపుదలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని సహా 30 మంది నాయకులు, కార్యకర్తలపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిరసన శాంతియుతంగా జరిగిందని, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కూడా కలిగించకుండా చేపట్టామని వైసీపీ శ్రేణులు అంటున్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడం కూడా నేరమా అని ప్రశ్నిస్తున్నారు.
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఈనెల 27న వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేట విద్యుత్ డీఈఈ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందు అనుమతి తీసుకున్న ఈ పోరుబాటలో భాగంగా, శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహించి విద్యుత్ డీఈఈ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
వైసీపీ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం అధికార పార్టీకి అసంతృప్తిని కలిగించిందని, అందుకే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అధికార పార్టీ వ్యక్తి ఒకరు ట్రాఫిక్ అంతరాయం కలిగిందని ఫిర్యాదు చేయడంతో, శనివారం రాత్రి పట్టణ పోలీసులు 30 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది.








