బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ప్రకటించడంతో ఆ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్‌పై కాంగ్రెస్ శ్రేణులు ట్రోల్ చేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో, తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ, నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించిన ఆయన, ఈ చిల్లర రాజకీయాలను కాంగ్రెస్ నేతలు కొనసాగిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో స్పష్టంగా తెలుసని, ఏ వర్గాల భవిష్యత్తు కోసం పనిచేయాలో తనకు క్లారిటీ ఉందని తెలిపారు. అయితే, పదవుల కోసం ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేసే సంస్కృతి తనకు లేదని, అన్ని పైసలు కూడా తన వద్ద లేవని విమర్శించారు. పదవుల కోసం ఢిల్లీకి పైసల మూటలు మోసే సంస్కృతి తనకు లేదన్నారు.