బ్రెజిల్ రాజకీయాల్లో కలకలం రేపే తీర్పు వెలువడింది. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు సైనిక కుట్ర కేసులో దోషిగా తేలడంతో కోర్టు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ ఈ తీర్పు ప్రకటించింది.
2022 ఎన్నికల్లో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా చేతిలో ఓటమి చెందిన తర్వాత కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బోల్సోనారో కుట్ర పన్నినట్టు కోర్టు తేల్చింది. ఆ ఎన్నికల అనంతరం దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బోల్సోనారో మద్దతుదారులు రాజధాని బ్రసీలియాలోని అధ్యక్ష భవనం, కాంగ్రెస్ భవనం, సుప్రీంకోర్టు ప్రాంగణంపై దాడులు జరిపారు. బారికేడ్లు ధ్వంసం చేసి, కిటికీలు పగులగొట్టి గందరగోళం సృష్టించారు. ఈ కుట్రలో బోల్సోనారోతో పాటు మరో 33 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఈ తీర్పుపై అంతర్జాతీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, బోల్సోనారోకు తన మద్దతును ప్రకటించారు. ఆయనకు విధించిన శిక్ష అన్యాయమని సూచిస్తూ బోల్సోనారో పక్కన నిలిచారు. ఈ కేసులో వచ్చిన తీర్పుతో బ్రెజిల్ రాజకీయ వాతావరణంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. బోల్సోనారోకు పడిన ఈ భారీ శిక్ష దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.