భారత సుప్రీంకోర్టు (Supreme Court of India) ప్రధాన న్యాయమూర్తిగా (CJI) భూషణ్ రామకృష్ణ గవాయ్ (Bhushan Ramkrishna Gavai) నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి కొలీజియం (Collegium) గవాయ్ పేరును అధికారికంగా సిఫార్సు చేసింది. మే 14, 2025న గవాయ్ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం (Swearing-In Ceremony) చేయనున్నారు.
భారత న్యాయ చరిత్రలో ఇది ఓ ప్రత్యేక ఘట్టం. దేశ అత్యున్నత న్యాయపీఠానికి చేరిన రెండవ దళిత న్యాయమూర్తి (Dalit Judge)గా గవాయ్ నియమితులయ్యారు. 2007లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత దళిత వర్గానికి చెందిన ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ గుర్తింపు పొందుతున్నారు.
గవాయ్ ప్రస్థానం..
భూషణ్ రామకృష్ణ గవాయ్ 1985లో బాంబే హైకోర్టు (Bombay High Court) నాగ్‌పూర్ బెంచ్ (Nagpur Bench)లో న్యాయవాది (Lawyer)గా ప్రాక్టీస్ ప్రారంభించారు. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రాసిక్యూటర్ (Public Prosecutor) గా సేవలందించారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, దాదాపు 16 సంవత్సరాలు అక్కడ విధులు నిర్వహించారు. 2019 మే 24న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇప్పుడు ఆయన మే 14, 2025 నుంచి నవంబర్ 24, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.