మ‌నం చేసిందే తిరిగొస్తోంది.. ఇప్పుడ‌నుకొని ఏం లాభం!

మ‌నం చేసిందే తిరిగొస్తోంది.. ఇప్పుడ‌నుకొని ఏం లాభం!

తెలుగు సినీ పరిశ్రమ (Telugu Cinema Industry)లో అభిమానుల మధ్య సోషల్ మీడియా యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) చిత్రంపై ‘#BoycottHHVM’ మరియు ‘#BanPawanMovie’ హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమాల్లో బాయ్‌కాట్ ఉద్యమం ట్రెండింగ్‌లో నిలిచింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మ‌హేష్‌బాబు అభిమాన సంఘాలు ఈ బాయ్‌కాట్‌కు పిలుపునిస్తూ, పవన్ కళ్యాణ్ అభిమానులతో జరుగుతున్న ఆన్‌లైన్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ ఫ్యాన్ వార్స్ గతంలో ఆయా సినీ హీరోల సినిమాల విడుద‌ల సంద‌ర్భంగా పవన్ అభిమానులు ట్రోల్ చేసినందుకు ప్రతీకారంగా జరుగుతున్నట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు.

సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా హాజ‌రైన‌వారు, హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన కామెంట్స్ సైతం వైసీపీ శ్రేణుల‌కు ఆగ్ర‌హం తెప్పించాయి. దీంతో ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌లో వైసీపీ శ్రేణులు సైతం భాగ‌స్వాముల‌య్యారు. సినిమా ఈవెంట్‌లో రాజ‌కీయ ప‌ర‌మైన కామెంట్లు, టికెట్ ధ‌ర పెంపు విష‌యంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లకు పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిని టాలీవుడ్ హీరోల‌ ఫ్యాన్స్ కూడా హ‌ర్ట్ అయ్యుంటార‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఈ వివాదం మూలాలు గత ఏడాది జరిగిన రాజకీయ సంఘటనల్లో ఉన్నాయి. 2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం, పవన్ కళ్యాణ్ జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉండటం ఈ రెండు తారల అభిమానుల మధ్య చిచ్చు రగిల్చింది. ‘పుష్ప 2’ విడుదల సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన స్టాంపీడ్ ఘటనలో ఒక మహిళ మరణించడం, అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంఘటన తర్వాత, పవన్ అభిమానులు అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ అత్యంత దారుణంగా ట్రోలింగ్ చేశారు. గ‌తంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసిన ట్రోలింగ్‌కు వారంతా రివేంజ్ తీర్చుకుంటున్నట్లుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ జూలై 24న విడుదలకు సిద్ధంగా ఉండగా, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మ‌హేష్‌బాబు అభిమానులు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. సినిమా ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్, కథను ‘అవుట్‌డేటెడ్’ అని విమర్శిస్తూ, పవన్ కళ్యాణ్‌ను ‘ఫాక్స్’ అని ఉద్దేశించి ట్రోల్స్ చేస్తున్నారు. మీమ్స్, వీడియోస్‌తో ప‌వ‌న్ అభిమానుల‌ను రెచ్చ‌గొట్టేలా కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఫ్యాన్ వార్స్ తెలుగు సినీ పరిశ్రమ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పరిశ్రమ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఈ రకమైన ట్రోలింగ్, వ్యక్తిగత దాడులు సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా, తారల ఇమేజ్‌కు కూడా హాని కలిగిస్తాయి” అని అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ బాయ్‌కాట్ ఉద్యమాన్ని వ్య‌తిరేకిస్తూ #HHVMBlazeFromJuly23 హ్యాష్‌ట్యాగ్‌తో కౌంటర్ ట్రెండ్‌ను ప్రారంభించారు. ‘హరిహర వీరమల్లు’ విడుదల సమయంలో ఈ ఆన్‌లైన్ యుద్ధం బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment