ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ మోషేన్‌రాజుపై వివక్ష చూపించారని బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం మండలిలో బొత్స సత్యనారాయణ అంశంపై చర్చకు లేవనెత్తారు.
క్రీడా పోటీలు రెండు సభల సభ్యులకు నిర్వహించారని, కానీ, శాసన మండలి చైర్మన్‌ను అవమానించారన్నారు. సీఎం, స్పీకర్ ఫొటోలు వేసి మండలి చైర్మన్ ఫొటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా మండలి చైర్మన్‌ను ఇలా కించపరచడం సమంజసం కాదని బొత్స సత్యనారాయణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న ఉమ్మడి ఫొటో సెషన్‌కు పిలిచి అక్కడ తనకు కుర్చీ వెయ్యలేదని, నాకు కుర్చీ వెయ్యకుండా ప్రోటోకాల్ పాటించలేదన్నారు. వేరే వాళ్ల కుర్చీలో కూర్చోమని చెప్పారన్నారు. నిన్న తనను, ఏకంగా మండలి చైర్మన్ ను ఇప్పుడు అగౌరవ పరిచారని బొత్స వ్యాఖ్యానించారు. బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.