సీఎం చంద్రబాబు (Chandrababu) తనపై ఉన్న అవినీతి కేసులను (Corruption Cases) మూసివేయించేందుకు వ్యవస్థలను బలవంతంగా ప్రభావితం చేస్తున్నారని, ఇందుకు అధికార దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘన, రాజకీయ ఒత్తిళ్లు అన్నీ ఉపయోగిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విమర్శించారు. తనకు ఎదురైన కేసుల్లో కీలక అధికారులను బెదిరించి, ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేయించడం ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్యానించారు.
2014–19 మధ్య చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి (Corruption)పై వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో పలు కేసులు నమోదయ్యాయని, వాటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం, అసైన్డ్ ల్యాండ్స్, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్ అవినీతి, లిక్కర్ పాలసీ దుర్వినియోగం వంటి కేసులు ఉన్నాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. స్కిల్ స్కాం కేసులో కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయనపై విచారణ పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు.
ఆ కేసుల్లో ఫిర్యాదుదారులైన అధికారులను బెదిరించి, కట్టుకథల కేసుల్లో ఇరికించి, ఫిర్యాదులను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని బొత్స తీవ్ర ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థలు కూడా చంద్రబాబు ఒత్తిడికి లోనై మౌనం వహిస్తున్నాయని, ఇదే కారణంగా ఇటీవలే అసైన్డ్ ల్యాండ్స్ కేసు, తాజాగా లిక్కర్ కేసు మూసివేయబడినట్లు పేర్కొన్నారు. ఇతర కేసులు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయన్నారు.
గవర్నర్ జోక్యం కోరిన బొత్స
“బెయిల్పై ఉన్న చంద్రబాబు సాక్షులను, ఫిర్యాదుదారులను బెదిరించడం అత్యంత దుర్మార్గం. ఇది చట్టపరమైన ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం” అని బొత్స తెలిపారు.
గవర్నర్ తక్షణం జోక్యం చేసుకుని చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని, దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. ‘‘చంద్రబాబు బెదిరింపులు, వ్యవస్థల నియంత్రణ ముందు మేం లొంగం. న్యాయపోరాటం కొనసాగిస్తాం’’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.








“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు