భారతదేశం (India) యొక్క మోస్ట్ వాంటెడ్ (Most Wanted) ఉగ్రవాదుల్లో ఒకడైన జైష్-ఎ-మహమ్మద్ (Jaish-e-Mohammed) సంస్థ అధిపతి మసూద్ అజార్ (Masood Azhar) ఎక్కడున్నాడో తమకు తెలియదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధిపతి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) అన్నారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్ ఖచ్చితమైన సమాచారం ఇస్తే అతన్ని పట్టుకుంటామని, బహుశా అతను ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండొచ్చని వింతగా వ్యాఖ్యానించారు. బిలావల్ భుట్టో పార్టీ ప్రస్తుతం పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది.
హఫీజ్ సయీద్ కస్టడీలో ఉన్నాడు.. మసూద్ అజార్ ఆచూకీ తెలియదు:
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని బిలావల్ భుట్టో కొట్టిపారేశారు. సయీద్ పాక్ కస్టడీలోనే ఉన్నాడని చెప్పారు. అయితే, మసూద్ అజార్ విషయానికి వస్తే, అతను ఎక్కడున్నాడో తమకు తెలియదని పునరుద్ఘాటించారు. “బహుశా అతను ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండి ఉంటాడని అనుమానిస్తున్నాం,” అని భుట్టో అన్నారు. “ఒకవేళ పాక్ గడ్డపైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం మాకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే.. సంతోషంగా అతడిని అరెస్టు చేస్తాం. కానీ న్యూఢిల్లీ మాత్రం ఆ వివరాలు ఇవ్వదు” అంటూ భుట్టో ఆరోపించారు.
మసూద్ అజార్: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది:
మసూద్ అజార్ భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. 2001 భారత పార్లమెంటుపై దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి అనేక దాడులకు ఇతడే సూత్రధారి. 2019లో ఐక్యరాజ్యసమితి (UN) ద్వారా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించబడ్డాడు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 కాందహార్ హైజాక్ తర్వాత, ప్రయాణీకులకు బదులుగా అజార్‌ను భారతదేశం విడుదల చేయాల్సి వచ్చింది.
భారతదేశం లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) చీఫ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed)తో పాటు మసూద్ అజార్‌ను తమకు అప్పగించాలని పాకిస్థాన్‌ను నిరంతరం డిమాండ్ చేస్తోంది. అయితే, పాకిస్థాన్ వద్ద ఆధారాలు ఉన్నప్పటికీ, ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతోందని భారత్ ఆరోపిస్తోంది.