ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణలో ఏసీబీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. కేటీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో పాటు ప్రస్తుతం అరెస్టుపై ఉన్న మధ్యంతర ఉత్తర్వులను సైతం రద్దు చేసింది. ఈ కేసులో నాట్ టు అరెస్టు ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా, ఇలాంటి పిటిషన్లలో కుదరదని, చట్ట ప్రకారం నడుచుకోవాలని, అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని కోర్టు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ హైకోర్టు తన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో ఈ కేసుపై దేశ అత్యున్నత న్యాయానికి వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లుగా సమాచారం. ఫార్ములా-ఈ రేస్‌లో ఒక్క పైసా అవినీతి జరగలేదని చెబుతున్న కేటీఆర్.. ఈ కేసులో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఫార్ములా-ఈరేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచనున్నట్లు తెలుస్తోంది. విచారణకు రావాలంటే ఏసీబీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ కేసులో ఈడీ కూడా జోక్యం చేసుకుంది. నిధుల అవకతవకలపై సమాధానం ఇవ్వాలని ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది.