ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షా పత్రం లీక్ కావడం విద్యారంగంలో సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖలో లీకేజీ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఎడ్ మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం పరీక్ష కంటే అరగంట ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం వివాదాస్పదంగా మారింది.
గుంటూరు జిల్లాలోని ఓ కాలేజీ యాజమాన్యం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిన్నటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కాగా, నిన్నటి ప్రశ్నాపత్రం కూడా అరగంట ముందుగానే లీక్ అయినట్లుగా సమాచారం.
ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ అధికారులతో విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. పరీక్షను రద్దు చేయడమే కాకుండా, ఈ ఘటన వెనుక ఉన్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.








