‘బాలకృష్ణ‌ వ్యాఖ్యలకు భయపడి పవన్ ఇంటికి చంద్రబాబు’

'బాలకృష్ణ‌ వ్యాఖ్యలకు భయపడి పవన్ ఇంటికి చంద్రబాబు'

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ సతీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ప్రారంభించినా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయకుండా సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చుతాయని, రాయలసీమలో దుర్భిక్షం మరింత పెరుగుతుందని స‌తీష్‌రెడ్డి హెచ్చరించారు. వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో వైసీపీ నేత స‌తీష్‌రెడ్డి మీడియా స‌మావేశంలో కూట‌మి ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

“కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రచార రాజకీయాలే ముఖ్యం” అని సతీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగక, జగన్‌పై వ్యక్తిగత దూషణలకే సమయం కేటాయించారని ఆయన విమర్శించారు. బాలకృష్ణ చేసిన అవమానకర వ్యాఖ్యలను చంద్రబాబు, స్పీకర్ అడ్డుకోలేకపోవడం అసెంబ్లీ గౌరవాన్ని తగ్గించిందని చెప్పారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై కూడా సతీష్‌రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. “ఆ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఏం లాభం కలిగింది? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చర్చ జరిగిందా? కృష్ణా జలాల నష్టం గురించి కేంద్రానికి తెలియజేశారా? రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గిట్టుబాటు ధరలు కల్పించారా?” అని నిలదీశారు. కోడెల ఆత్మహత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని, ఫర్నిచర్ అంశంలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

“అధికారంలోకి రాకముందు చిరంజీవి దేవుడని పొగిడిన చంద్రబాబు, ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలతో భయపడి పవన్ ఇంటికి వెళ్తున్నారు. చంద్రబాబు సీఎం కుర్చీపై కూర్చోవడం పవన్ పుణ్యమే కానీ, ఆయనతో చేసిన వాగ్దానాలు మాత్రం మర్చిపోయారు. ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకుండా పాత పథకాలకే పరిమితమయ్యారు” అని సతీష్‌రెడ్డి మండిపడ్డారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, వైసీపీ ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment