ఆయేషా మీరా (Ayesha Meera) హత్య కేసు (Murder Case)లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ(CBi) తమకు నివేదిక ఇవ్వడం లేదంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సీబీఐ కోర్టు విచారణ జరిపి ఈ నెల 10లోపు నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇంకా నివేదిక అందకపోవడంతో ఆయేషా తల్లిదండ్రులు కోర్టులో మెమో దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు విచారణను వాయిదా వేసి, ఈ నెల 31లోపు నివేదికను సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు వివరాలు — అంటే రెండు ఎఫ్‌ఐఆర్‌లు, డీఎన్ఏ(DNA) నమూనాలు, సాక్షుల వాంగ్మూలాలు అందితేనే తాము అభ్యంతరాలు వ్యక్తం చేయగలమని ఆయేషా తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు.
ఇక సాక్ష్యాల ధ్వంసం కేసుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ తమకు సంబంధం లేదని, సీబీఐ తప్పుడు వాదన చేస్తోందని ఆయేషా పేరెంట్స్ తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామనే సంకల్పంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు ముందుకు సాగుతున్నారు.
అసలు కేసు ఏంటంటే..
విజయవాడ (Vijayawada)కు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ (Sri Durga Ladies Hostel) లో ఉంటూ, నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తున్న 17 ఏళ్ళ ఆయేషా మీరాను 27 డిసెంబరు 2007న అత్యాచారం చేసి హత్య చేశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బాత్రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మృతదేహం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ప్రేమను కాదన్నందుకే ఆయేషాకి ఈ గతి పట్టించానని హంతకుడు ఒక లేఖ వదిలి వెళ్ళాడు.








