ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల జరుగుతున్న విషయాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న శ్రీవారి మాడ వీధుల్లో ఓ వ్యక్తి తప్పతాగి రచ్చ చేసిన వీడియో బయటపడగా, నేడు శ్రీవారి మెట్టు వద్ద ఆటో డ్రైవర్ల దందా వెలుగులోకి వచ్చింది. వీకెండ్స్‌లో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను టార్గెట్ చేసుకొని ఆటో డ్రైవర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, వీరికి అధికారుల అండ మెండుగా ఉందని తెలుస్తోంది.
వీకెండ్స్‌లో శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టైమ్ స్లాటెడ్ టికెట్లు ఇప్పిస్తామని ఆటో డ్రైవర్లు మాయమాటలు చెప్పి.. భక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్లకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సహకారం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సొంత వాహనాల్లో వచ్చినవారిని అనుమతించకుండా ఆటోలను అనుమతిస్తున్నారంటూ భక్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీవారి మెట్టు వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో పంప్ హౌస్ దగ్గర బారికేడ్ల ఏర్పాటు చేశారు. అయినా సెక్యూరిటీని తోసుకుని భక్తులు కౌంటర్లకు చేరుకున్నారు. తిరుమల గురించి రోజుకో విషయం వార్తల్లో నిలుస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.