ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఆసియా కప్ (Asia Cup) ఫైనల్ (Final)లో భారత్–పాకిస్తాన్ (India–Pakistan) జట్లు నేడు తలపడనున్నాయి. ఈరోజు సాయంత్రం 8 గంటలకు ఈ ఉత్కంఠ పోరు మొదలవ్వనుంది. ఈ హై ఓల్టేజ్ (High Voltage) మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఎప్పటిలాగే మాటల యుద్ధం, చిన్న చిన్న వివాదాలు చోటుచేసుకుంటూ, అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.
పీక్‌లో టీమిండియా ఫామ్..
ఇప్పటికే వరుసగా ఆరు విజయాలు సాధించిన టీమిండియా, ఫైనల్‌లో కూడా అదే దూకుడు కొనసాగించాలని చూస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉండి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. తిలక్ వర్మ, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే కూడా నిరంతరం జట్టుకు తోడ్పడుతున్నారు. లంకపై మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా ఫైనల్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముందని టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది.
బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇప్పటికే ప్రత్యర్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. 8 టైటిళ్లు సాధించిన భారత్ తొమ్మిదో ట్రోఫీని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రతీకారం కోసం పాకిస్తాన్..
ఈ టోర్నమెంట్‌లో అంతంతమాత్రం ప్రదర్శన చూపించినా పాకిస్తాన్ ఫైనల్‌కు చేరింది. బౌలింగ్ బలంగా ఉన్నా, బ్యాటింగ్ విభాగంలో పెద్దగా ఆడగాళ్లు రాణించలేకపోయారు. భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన పాక్, ఈసారి తప్పక గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది.
2022 తర్వాత భారత్‌పై ఏ ఫార్మాట్‌లోనూ విజయం సాధించని పాకిస్తాన్, ఈ ఫైనల్‌తో ఆ దుర్భర రికార్డును చెరిపేయాలనుకుంటోంది. మరోవైపు, భారత్ తొమ్మిదో టైటిల్‌ను దక్కించుకుని ఆసియా క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోవాలని చూస్తోంది. కాబట్టి అభిమానులందరికీ నేడు జరగబోయే ఫైనల్ ఉత్కంఠభరితంగా మారడం ఖాయం.







