ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం (Free Bus Scheme) .. ఎంతగా ఉపయోగపడుతుందో.. అంతకంటే ఎక్కువ విమర్శలపాలవుతోంది. ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన నాటినుంచి ఉచిత బస్సులో సీటు కోసం పురుషుల మీద మహిళలు చేయి చేసుకోవడం, మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, కండక్టర్లను (Conductors) దబాయిస్తూ మాట్లాడడం వంటి వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తుండగా, తాజాగా ఓ మహిళా కండక్టర్ (Woman Conductor) తన ఆవేదనను వ్యక్తం చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“మా ఊపిరి (Breath) బస్సులోనే ఆగిపోతుందేమో” అని మహిళా కండక్టర్ వాపోయింది. బస్సు ఆక్యుపెన్సీ (Occupancy)కి మించి ఎక్కువ మంది ఎక్కడం వల్ల తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని తెలిపింది. “బస్సుకు వచ్చి 150 నుంచి 170 మంది ఎక్కుతున్నారు. కండక్టర్లతో దురుసుగా మాట్లాడుతున్నారు. డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కడం లేదు. మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకోవడమేంటని అధికారులను ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.
“మా సేవ పట్ల అధికారులకి జాలి లేదా? బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్‌పై తిరగబడడం రోజువారీగా జరుగుతోంది. మేము పొందుతున్న జీతాల కంటే ఎంతో ఎక్కువ కష్టపడుతున్నాం” అని ఆమె తన వీడియోలో పేర్కొంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల విశాఖ నగరంలో ఓ బస్సులో 130 మంది ప్రయాణికులు ఎక్కడంతో ఓవర్‌లోడ్ కారణంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన తెలిసిందే. కాగా, ప్రభుత్వమే ఈ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో కండక్టర్ల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అలాగే బస్సుల్లో నిర్ణయించిన ఆక్యుపెన్సీకి మించి ప్రయాణికులను ఎక్కించకూడదనే షరతుపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నదో వేచి చూడాల్సి ఉంది.
మా ఊపిరి జనాల మధ్య ఆగిపోయేలా ఉంది – కండక్టర్ ఆవేదన
— Telugu Feed (@Telugufeedsite) September 16, 2025
ఎందుకు మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఆడుకుంటున్నారు
బస్సుకు వచ్చి 150 నుంచి 170 మంది ఎక్కుతున్నారు.. కండక్టర్‌తో దురుసుగా మాట్లాడుతున్నారు
మీరిచ్చే జీతాలకంటే మేము ఎక్కువే కష్టపడుతున్నాం అంటూ… pic.twitter.com/GAuqI1Lswi








