రాష్ట్ర మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణంపై శాసనమండలి సాక్షిగా మంత్రి చెప్పిన సమాధానం ఏపీ మహిళలందరినీ షాక్‌కు గురిచేసింది. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన ప్రకటనపై ఏపీ మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్సీ పీవీ సూర్యనారాయణ రాజు ఉచిత బస్సు పథకంపై ప్రశ్న వేశారు. ఉచిత బస్సు పథకం ద్వారా అన్నవరం నుంచి తిరుపతి వెళ్లే అవకాశం ఉంటుందని మహిళలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ, ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకే పరిమితమని, ఒక జిల్లాకు చెందిన మహిళలు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలకే పరిమితం చేయడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు హామీ.. అమలు గందరగోళం
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆ పథకం జిల్లాలకే పరిమితం చేస్తామని మంత్రి సమాధానం ద్వారా స్పష్టమవ్వడంతో ప్రభుత్వంపై మహిళల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చని మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక షరతులు విధిస్తుండటంతో ఏపీ మహిళా ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం మహిళలను మరోసారి మోసం చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ హామీపై చంద్రబాబు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జిల్లాలకే పరిమితం చేయడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.