ఏపీ ‘స్కిల్’ స్కామ్‌.. ఈడీ సంచ‌ల‌న రిపోర్ట్

ఏపీ 'స్కిల్' స్కామ్‌.. ఈడీ సంచ‌ల‌న రిపోర్ట్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) – సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విశాఖపట్నం పీఎంఎల్‌ఏ కోర్టులో సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను దాఖలు చేసింది. ఈ కంప్లైంట్‌ను కోర్టు జనవరి 28న పరిగణలోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.

ఈ సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DTSPL), ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, మిస్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ తదితరులను నిందితులుగా పేర్కొంది. ఇదే కేసులో 52 రోజుల పాటు చంద్ర‌బాబు నాయుడు జైలు జీవితం అనుభ‌వించిన విష‌యం తెలిసిందే.

షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు
ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసులో దర్యాప్తు చేపట్టామని ఈడీ తెలిపింది. దర్యాప్తులో భాగంగా, DTSPL, సీమెన్స్ అనుబంధ వ్యక్తులు కలిసి షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, మల్టీ లేయర్ ట్రాన్సాక్షన్ల ద్వారా ఏపీ ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించినట్లు ఈడీ గుర్తించింది.

పరికరాలు, సేవలు సరఫరా చేసినట్టు చూపుతూ నకిలీ ఇన్వాయిస్‌లు (బోగస్ బిల్లులు) సృష్టించి నిధులను మళ్లించారని ఈడీ పేర్కొంది. అలాగే ఎంట్రీ ప్రొవైడర్ల సేవలను వినియోగించి, వారికి కమీషన్లు చెల్లిస్తూ భారీ స్థాయిలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని వెల్లడించింది.

అరెస్టులు, ఆస్తుల అటాచ్మెంట్
ఈ కేసులో దర్యాప్తు సందర్భంగా 2023 మార్చి 4న DTSPL ఎండీ వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్‌లను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం 2023 ఏప్రిల్‌లో DTSPL పేరిట ఉన్న రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసినట్లు తెలిపింది.

అలాగే 2023 మే నెలలో విశాఖపట్నం పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే ప్రాంతాల్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్సులు, షేర్లు, స్థిరాస్తులు కలిపి రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేసినట్లు వెల్లడించింది.

మొత్తం అటాచ్ చేసిన ఆస్తులు రూ.54.74 కోట్లు
ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. మరింత దర్యాప్తు ఆధారంగా తాజాగా సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను దాఖలు చేయగా, జనవరి 28న కోర్టు దానిని పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో, న్యాయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment