ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త పురుగు వ్యాధి కలకలం సృష్టిస్తోంది. స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పురుగు కాటు (Insect Bite) ద్వారా వ్యాపించే ఈ వ్యాధి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,317 కేసులు నమోదైనట్లుగా సమాచారం. ప్రత్యేకంగా విజయనగరం (Vizianagaram) జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలతో ఒక మహిళ ప్రాణం కోల్పోవడంతో భయం మరింత పెరిగింది.
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి (Rajeshwari) (36) కొంతకాలంగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షల్లో ఆమెకు స్క్రబ్ టైఫస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలో ప్రజలను మరింత అప్రమత్తతకు గురిచేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు దాదాపు అన్ని జిల్లాల్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు (379 కేసులు), కాకినాడ (141), విశాఖపట్నం (123), వైఎస్సార్ కడప (94), నెల్లూరు (86) వంటి జిల్లాల్లో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయని వైద్య శాఖ తెలిపింది.
స్క్రబ్ టైఫస్‌కు సమయానికి చికిత్స అందితే సాధారణ యాంటిబయాటిక్స్‌తో పూర్తిగా నయం అవుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జ్వరం, శరీర నొప్పులు, చర్మంపై నల్లటి పుండ్ల వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పొదలు, దట్టమైన గడ్డిలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.








