ఏపీ ప్ర‌జ‌ల‌పై సెస్‌లు, ప‌న్నుల భారం.. రూ.13,100 కోట్లు టార్గెట్‌

ఏపీ ప్ర‌జ‌ల‌పై సెస్‌లు, ప‌న్నుల భారం.. రూ.13,100 కోట్లు టార్గెట్‌

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి సారించింది. ప్ర‌జ‌ల‌పై ప‌న్నులు (Taxes), సెస్‌ల (Cesses) రూపంలో వచ్చే ఏడాది కాలానికి దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ మార్గాలను పరిశీలిస్తోంది. ప్రజల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదాయం వసూలు చేసే అంశాలపై ఇప్పటికే అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. హెచ్‌వోడీల (HODs) సదస్సులో ఈ విషయాలను ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ (Piyush Kumar) వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రతిపాదిత మార్గాలపై సమగ్ర సమీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ప్రతిపాదనల ప్రకారం.. SGSTపై 1 శాతం సెస్ విధించడం ద్వారా సుమారు రూ.4,700 కోట్ల అదనపు ఆదాయం సాధించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సెస్ అంశం ప్రస్తుతం 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలనలో ఉందని అధికారులు వెల్లడించారు.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ లాటరీ పునఃప్రారంభం ద్వారా రూ.3,000 కోట్లు, ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను విధించడం ద్వారా రూ.1,400 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా రూ.2,300 కోట్లు, రెండో, మూడో స్థాయి అమ్మకాలపై VAT ద్వారా రూ.1,300 కోట్లు ఆదాయం వచ్చే అవకాశముందని స‌మాచారం.

అలాగే ప్రొఫెషన్ టాక్స్ పెంపు ద్వారా రూ.400 కోట్లు, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ప్రొఫెషన్ టాక్స్ వసూళ్ల బదిలీ ద్వారా రూ.110 కోట్లు సమకూర్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ అన్ని మార్గాలను కలిపి ప్రభుత్వం మొత్తం రూ.13,100 కోట్ల కొత్త ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.

ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయాలు తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త పన్నులు, సెస్‌లు ప్రజలపై ఎంత ప్రభావం చూపుతాయన్న అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment