పేకాట డెన్‌గా ఏపీ..? ఏకంగా మంత్రి ఇలాకాలోనే..

పేకాట డెన్‌గా ఏపీ..? ఏకంగా మంత్రి ఇలాకాలోనే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం పేకాట డెన్‌గా (Gambling Den) మారుతోందన్న విమ‌ర్శ‌ల‌కు తాజా ఘ‌ట‌న నిలువుట‌ద్దం ప‌డుతోంది. ఏకంగా సీఎం చంద్ర‌బాబు (Chief Minister Chandrababu Naidu) కేబినెట్‌లోని మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో య‌థేచ్ఛ‌గా భారీ పేకాట క్లబ్బు నిర్వ‌హించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌ల రాష్ట్రంలో డ్ర‌గ్స్ మాఫియా, న‌కిలీ మద్యం విక్రయాలు, ఏకంగా మంత్రి లోకేష్ (Minister Nara Lokesh) ఇలాకాలో 13 ఏళ్ల బాలిక‌పై గ్యాంగ్ రేప్‌ వంటి ఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చుతుండ‌గా, తాజాగా భారీ ఎత్తున పేకాట క్ల‌బ్బులు వెలుగు చూడ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఏలూరు జిల్లాలోని మంత్రి పార్థసారథి (Minister Parthasarathi) ప్రాతినిథ్యం నూజివీడు నియోజకవర్గ పరిధిలో భారీ స్థాయిలో పేకాట కలకలం రేపుతోంది. ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటలో ఉన్న మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్‌ (Mango Bay Recreation Club)పై పోలీసులు ఆకస్మికంగా మెరుపు దాడులు నిర్వహించారు.

పోలీసుల దాడుల్లో 120 మందికి పైగా పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని సమాచారం. పేకాట శిబిరంలో టీడీపీ(TDP)కి చెందిన కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని విచారణ అనంతరం పంపించేశారు. ఎక్కువ మంది అధికారపార్టీకి చెందిన వారే కావడంతో వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నార‌ని, గత రాత్రి గుట్టుచప్పుడు కాకుండా కొందరిని పంపించేసినట్లు సమాచారం.

పేకాట ఆడేందుకు తెలంగాణతో పాటు ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల నుంచి ప్రముఖులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడుల సమయంలో ఇప్పటివరకు 80 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 150 మందికి పైగా పేకాట రాయుళ్లను విచారిస్తున్నారు.

ఇప్పటివరకు రూ.34 లక్షల నగదు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇంకా మధ్యవర్తుల సమక్షంలో నగదు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. క్లబ్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి సోదాలు కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ అండ‌దండ‌ల‌తోనే ఇదంతా జ‌రుగుతుంద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

విశాఖలోనూ పేకాట?
ఇక మరోవైపు విశాఖలోనూ పేకాట వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. పిక్నిక్ పేరుతో రిసార్టుల్లో భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగమారిపేట సమీపంలోని ఓ రిసార్ట్‌లో విచ్చలవిడిగా జూదం సాగుతోందని సమాచారం. పేకాట శిబిరాల వద్ద డబ్బుల కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

పచ్చ చొక్కాలు ధరించి అధికార పార్టీ నేతలు దర్జాగా పేకాట ఆడుతున్నారని, కూటమి ఎమ్మెల్యేల అండదండలతో ఈ వ్యవహారం సాగుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఏపీని పేకాట హబ్‌గా మారుస్తున్నారన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. ఈ ఘటనలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment