ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఒక అమాత్యుని వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఇంట్లో జరిగిన కార్యక్రమం అధికారుల నెత్తిమీద పడింది. ఆ అమాత్యుని శాఖకు సంబంధించిన రాష్ట్రంలోని ఉన్నతాధికారుల జేబులు గుల్లయ్యాయి.
తన ఇంట్లో కార్యక్రమానికి సంబంధించి ఒక్కో అధికారికి ఒక్కో పని పురమాయించాడు. ఒకరికి బంధువుల కోసం లాడ్జీలు బుక్ చేసే పని, దానికి సంబంధించిన ఖర్చులు భరించే పని అప్పగిస్తే.. మరొక అధికారికి వాహనాలు, వాటికి సంబంధించిన ఖర్చులు అప్పగించాడు.
ఇంకో అధికారికి కార్యక్రమానికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని అప్పగించాడు. విచిత్రంగా మరొక అధికారికి తిరుమల (Tirumala) లడ్డూలు (Laddus) తెచ్చే పనిని అప్పగించాడు. తన ఇంట్లో జరిగే కార్యక్రమానికి వచ్చే బంధువులకు ఈ లడ్డూలు ఇవ్వాలన్నది ఆ అమాత్యుడి ఉద్దేశం. ఆ లడ్డూల ఖర్చు కూడా ఆ అధికారిదే. అమాత్యుడి ఆదేశం ఖర్చు పెట్టక తప్పుతుందా..?
ఈ అమాత్యుడి వ్యవహారాలతో సంబంధిత విభాగాలలో అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. రివ్యూల పేరిట రాష్ట్రంలో ఆ అమాత్యుడు ఎక్కడకు వెళ్లినా ఆయన వేసుకునే ప్యాంటు, చొక్కాలు కూడా అధికారులే కొని ఇవ్వాలంట. ఈ బాగోతాలు చూసి అధికారులు హడలెత్తిపోతున్నారు.








