ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ప్రభుత్వాలకు మధ్య తేడా అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారని, సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడైనట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ సర్వే కేవలం ప్రజల నాడి తెలుసుకునేందుకు జరిపినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు నెలలు దాటిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుందనే ప్రశ్నకు మెజార్టీ ప్రజలు వైఎస్ జగన్ వైపే మొగ్గు చూపారని, తరువాత స్థానంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగున ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు మధ్య తేడా కూడా ఎన్నికల నాటితో పోలిస్తే బాగా పెరిగింది. గత ప్రభుత్వ పనితీరు, అందించిన ప్రయోజనాలు, అందుకున్న లబ్ధిదారుల విషయంలో గతానికి, ఇప్పటికీ మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోందని, జగన్ మార్కుకు చాలా దూరంలో ప్రభుత్వం ఉందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రాఫ్ బాగా పడిపోయిందని తెలుస్తోంది. పార్టీ సంస్థాగతంగా లేకపోవడం, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం, చెప్తున్న మాటలేవీ ఆచరణలో కనిపించకపోవడం అన్నింటికీ మించి అవాస్తవాల ప్రచారంతో చంద్రబాబును రక్షించేందుకే ఆయన రాజకీయాలు నడుపుతున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ పార్టీని నడపడంలో స్వతంత్రత లేకపోవడం కూడా దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినీ యిజం నుంచి ఆయన బయటకు రాకపోవడం కూడా ఒక కారణంగా ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు సర్వే వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
అన్నింటికీ మించి టీడీపీలో తీవ్రమైన అసంతృప్తి, కూటమి పార్టీ నేతల మధ్య డామినేషన్, అవినీతి, పక్షపాతం, ప్రజలు వివక్షకు గురకావడం, ప్రతి అంశంలో పార్టీల ప్రస్తావన తీసుకురావడం ప్రభుత్వానికి మైనస్‌గా మారినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిరుద్యోగం, నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, విద్యుత్ చార్జీలు మోయలేని భారంగా మారడం, ఇసుక అక్రమ తరలింపు కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకపోవడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన అందనంత దూరానికి చేరడం కూడా కారణాలుగా తెలుస్తోంది.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయిన నేపథ్యంలో కేవలం ప్రజల పల్స్ తెలుసుకోవడానికి మాత్రమే ఓ స్వతంత్ర సంస్థ అంతర్గతంగా ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. అందువల్లే అధికారికంగా సర్వే ఫలితాలు బయటకు విడుదల చేయడానికి నిరాకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.