ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం.. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్

ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం.. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మ‌రోసారి తీరని అన్యాయం జరిగింది. రైల్వేజోన్‌లో అతి ముఖ్య‌మైన కేకే లైన్ (కోరాపుట్–కిరండుల్ లైన్) (KK Line – Koraput–Kirandul Line) లేకుండానే జోన్ స్వ‌రూపాన్ని కేంద్ర ప్ర‌క‌టించ‌డంపై ఏపీలో వివాదం మొద‌లైంది. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించింద‌ని, చంద్రబాబు (N. Chandrababu Naidu) ప్రభుత్వ నిర్ల‌క్ష్య విధానం కారణంగా విశాఖ రైల్వే జోన్ (Visakhapatnam Railway Zone) కీలకమైన కేకే లైన్ లేకుండానే ఖరారైందని వైసీపీ(YSRCP)తో పాటు ఉత్త‌రాంధ్ర వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైన్‌ను ఈ జోన్‌లో చేర్చకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

కేకే లైన్ ద్వారా ఏటా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి కీలక మార్గాన్ని కోల్పోవడం వల్ల విశాఖ జోన్ ప్రయోజనం కోల్పోయింది. ఉత్తరాంధ్ర ప్రజలు, రైల్వే యూనియన్లు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూటమి ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టిందని వైసీపీ నేత‌లు ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో అన్యాయం జరగడం దురదృష్టకరమన్నారు.

ఒడిశా ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాపాడలేకపోతోందని వైసీపీ మండిపడింది. చారిత్రక వాల్తేర్ డివిజన్‌ను కనుమరుగుచేయడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొంది. విభజన చట్టంలో కేకే లైన్‌తో కూడిన డివిజన్ ఇస్తామని స్పష్టంగా ఉన్నప్పటికీ, దాన్ని అమలు చేయడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించింది.

కేకే లైన్‌ను రాయగడలో కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరుగుతోంది. కేంద్రంలో శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ అంశంలో పూర్తిగా నిద్రపోతున్నారని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా న్యాయం చేయలేకపోతున్నారని వైసీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

ఉత్తరాంధ్ర ప్రాంతం (North Andhra Region) పట్ల చంద్రబాబుకు ద్వేష భావం ఉన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతి కోసం విశాఖకు అన్యాయం చేస్తున్నారని, కేకే లైన్ లేని రైల్వే జోన్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. వాల్తేర్ డివిజన్‌తో కూడిన సంపూర్ణ రైల్వే జోన్ ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

రైల్వే జోన్ కోసం గతంలో వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేసిందని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉద్యమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేకే లైన్‌ను వైజాగ్ డివిజన్‌లో కలిపే వరకు వైసీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ అంశం కాదని, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశమని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని వైసీపీ పిలుపునిచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment