ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్ర‌మిస్తున్నాం.. – సీఎం చంద్రబాబు

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్ర‌మిస్తున్నాం.. - సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ (Economic System) తీవ్రంగా దెబ్బతిన్నద‌ని, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్ర‌మిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (N. Chandrababu Naidu) అన్నారు. ప్రతి త్రైమాసికం రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పర్యవేక్షిస్తూ, అభివృద్ధిని ఒక దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని తెలిపారు. ఏపీ జీఎస్డీపీ (AP GSDP)పై సచివాలయం (Secretariat)లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

చంద్రబాబు మాట్లాడుతూ— “గత ఐదేళ్లలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ఆదాయం తగ్గి, అనేక రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయి. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అధికారంలోకి వచ్చేనాటికి ఎక్కడ చూసినా లోటు, సమస్యలు మాత్రమే కనిపించాయి. ఇప్పుడు వాటిని సరిచేస్తూ అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం” అని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, సూపర్‌ సిక్స్ పాలసీలు సూపర్‌ హిట్ అయ్యాయని అన్నారు. “చేయలేమని మేము పారిపోం… రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా పనిచేస్తున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర పథకాల్లో జరిగిన అవకతవకలను ఎత్తిచూపుతూ, గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారిమళ్లించిందని ఆరోపించారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్ని మళ్లీ రివైవ్ చేశామని చంద్ర‌బాబు చెప్పారు.

విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు రాష్ట్రానికి భారీ నష్టం చేశాయని చంద్రబాబు తేల్చిచెప్పారు. “పీపీఎలు రద్దు చేయడంతో ఎలాంటి విద్యుత్ వాడకపోయినా ₹9,000 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. కానీ మా ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టింది” అన్నారు. వచ్చే ఏడాది ఈ రంగంలో మరింత సామర్థ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు.

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్నందున పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారని, ఇప్పుడు త‌మ ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తోందని సీఎం చంద్ర‌బాబు వివరించారు. గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలే కాకుండా ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిందని ఆయన విమర్శించారు. విద్యా వ్యవస్థను కూడా చెడగొట్టి, భారీగా బిల్లులు పెండింగ్‌లో వదిలేశారని మండిపడ్డారు.

“జీఎస్డీపీ పెరిగితేనే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రంగా పనిచేస్తోంది” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment