ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలకు సొంతిళ్లు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా 17 వేలకు పైగా ప్రాంతాల్లో వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో ఇళ్ల నిర్మాణాలను సైతం చేపట్టింది. దానికి వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా నామకరణం చేశారు. అప్పట్లో ఈ ఇళ్ల నిర్మాణం ఒక సంచలన కార్యక్రమంగా నడిచింది.
జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాలనీలకు కొత్తగా “పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్” అనే పేరు ఖరారు చేసింది. పేదలందరికీ ఇళ్లు కట్టే కార్యక్రమం భాగంగా ఏర్పడిన జగనన్న కాలనీల పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకువచ్చిన జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, గోరుముద్ద వంటి ప్రతిష్టాత్మక పథకాలకు కూటమి సర్కార్ మార్చిన విషయం తెలిసిందే. తాజాగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరును కూడా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కూటమి నిర్ణయంపై ప్రతిపక్ష వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.