ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య ప్రత్యేక విమానాల వినియోగంపై ఆరోపణలు–ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజా సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని, వీకెండ్‌ల్లో హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నారని వైసీపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వివరాలను, ప్రయాణ లెక్కలను కూడా వైసీపీ బహిర్గతం చేస్తూ ప్రభుత్వ పెద్దల ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయని ఆరోపిస్తోంది.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వ పెద్దల విలాసాలు తగ్గడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ప్రత్యేక విమానాల్లోనే ముఖ్య నేతల పర్యటనలు, వీకెండ్ ఎంజాయ్‌మెంట్ కోసం హైదరాబాద్, ముంబై, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తుంది. ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ దుబాయ్, ముంబైల్లో క్రికెట్ చూడటానికి స్పెషల్ ఫ్లైట్స్ వాడారని, చంద్రబాబు 88 సార్లు, లోకేష్ 92 సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారనే గణాంకాలను వైసీపీ ప్రస్తావించింది. పవన్ కళ్యాణ్ కూడా హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల ద్వారా తరచుగా ప్రయాణిస్తున్నారని మండిపడుతోంది. లోకేష్ తన సొంత ఖర్చులతో వెళ్తున్నారని టీడీపీ బయటకు ప్రకటించినా.. ఆ వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. G.O.RT.No. 1721లో ప్రభుత్వం కేటాయించిన రూ.54 కోట్లకు లెక్క తేలాల్సి ఉంది.
టీడీపీ నుంచి ఆరోపణలు..
ఇక టీడీపీ వైపు నుంచి కూడా ప్రతిగా ఆరోపణలు వస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్లను వాడారని టీడీపీ చెబుతోంది. అయితే వైసీపీ మాత్రం ఈ పోలికను తప్పుబడుతోంది. జగన్ సీఎం హోదాలో హెలికాప్టర్లలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారని, కేంద్ర పెద్దలను కలవడానికి ఢిల్లీకి మాత్రమే వెళ్లారని చెబుతోంది. సీఎంగా జగన్ అమరావతిలో ఉండే పరిపాలన చేశారని, వీకెండ్ సాకుతో హైదరాబాద్‌కు వెళ్లిపోలేదని, ఐదేళ్లూ ఏపీలోనే ఉన్నారని, ప్రజాధనంతో వ్యక్తిగత పర్యటనలు చేయలేదని గుర్తుచేస్తోంది.
అయితే సీఎం స్థాయిలో ఉన్న జగన్ పర్యటనలను మంత్రిగా ఉన్న నారా లోకేష్ పర్యటనలతో తెలుగుదేశం పార్టీ పోల్చడంపై వైసీపీ మండిపడుతోంది. లోకేష్ స్థాయిని పెంచడం కోసం ముఖ్యమంత్రి స్థాయిని కించపరుస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. సీఎం, మంత్రుల హోదాలను కూడా టీడీపీ అవగాహన లేకుండా పోలుస్తోందని వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు.
రెండు పార్టీల మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు కొనసాగుతున్న తరుణంలో, ఏపీలో ప్రజా సొమ్ముతో నేతలు చేస్తున్న విలాసాలపై ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు జోరు ఆగకపోవడంపై సామాజిక వేదికలలో చర్చ మరింత వేడెక్కింది. ఈ విమాన ఖర్చుల వివాదం రాజకీయంగా మరోసారి రెండు పార్టీల మధ్య పెద్ద తుపాను రేపింది.









