సినీ నటి, ఏపీ(AP) మాజీ మంత్రి రోజ (Roja) కుమార్తె (Daughter) అన్షు మాలిక (Anshu Malik) తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బాల్యం నుంచే రచయిత్రిగా పలు పుస్తకాలు రాసి, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అన్షు, ప్రస్తుతం అమెరికా (America)లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఆమె ఇటీవల ప్రతిష్టాత్మకమైన “మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు 2025-26” (Maureen Biggers Leadership Award 2025-26)ను అందుకున్నారు.
అమెరికాలోని బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతున్న అన్షు, టెక్నాలజీ రంగంలో మహిళల సాధికారతకు కృషి చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
వెనుకబడిన వర్గాల వారికి సాంకేతిక అవకాశాలు కల్పించడం, నమీబియా, నైజీరియా, భారతదేశం వంటి దేశాల్లో కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వడం వంటి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. సోషల్ మీడియా ద్వారా పేదలకు సాంకేతిక విద్యను అందించడంలో ఆమె చేసిన పరిశోధన, కృషి కూడా ఈ అవార్డుకు కారణమయ్యాయి. ఈ అవార్డు పొందిన విషయాన్ని అన్షు తన సోషల్ మీడియాలో పంచుకోగా, ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.







