దక్షిణ అండమాన్ సముద్రం (South Andaman Sea)పై ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ మార్పులు సంభవించే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Organisation) తాజా పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రైతులకు ముఖ్య సూచనలు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులకు కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. ఇప్పటికే కోసిన వరిని వెంటనే కుప్పలు వేసి సురక్షితంగా భద్రపరచాలి. ధాన్యం వర్షంలో తడవకుండా పూర్తిగా పట్టాలతో కప్పి రక్షించుకోవాలి. గింజలు తడిసి రంగు మారకుండా, మొలకెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తడిసిన ధాన్యంతో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
రాబోయే రోజులలో వ్యవసాయ కార్యకలాపాలపై వాతావరణం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, రైతులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.








