ఆది ‘క‌మ్మ‌గా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్

ఆది 'క‌మ్మ‌గా' వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు - ఏపీ బీజేపీ చీఫ్

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇంకా “కమ్మ”గానే ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో చర్చనీయాంశంగా మారాయి. కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో త‌న స‌మ‌క్షంలో ఆదినారాయ‌ణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ స్పష్టమైన ప్రకటన చేశారు.

బీజేపీ సమావేశంలో ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్టీ ఏకీభవించడం లేదని మాధవ్ స్పష్టం చేశారు. “ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యల‌తో త‌న‌కు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన చెప్పారు. అలాగే, రాష్ట్రంలో బీజేపీ లేనిదే టీడీపీ, జనసేనలు లేవని, కూటమిలో బీజేపీనే ప్రధానం అన్నట్లు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా మాధవ్ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి నుంచి వివరణ కోరతామని ఆయన వెల్లడించారు.

కూట‌మి ప్రభుత్వంలో కమ్మ కులస్థుల ఆధిపత్యం ఎక్కువగా ఉందంటూ ఆదినారాయణ రెడ్డి ప‌రోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అలాగే, బీజేపీ కోసం గట్టిగా పోరాడిన కేడర్‌కు మరిన్ని అవకాశాలు కల్పించాలని ఏపీ బీజేపీ చీఫ్‌ను కోరుతూ చేసిన వ్యాఖ్యలు కూడా కూటమి నేతల మధ్య విభేదాలను బహిర్గతం చేశాయి.

ఈ పరిణామాలతో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరినట్టుగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు, వాటిపై మాధవ్ చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment