ఏపీలో ‘ఆరోగ్యశ్రీ’ సేవ‌లు బంద్.. ‘ఆశ’ సంచలన నిర్ణయం!

ఏపీలో ‘ఆరోగ్యశ్రీ’ సేవ‌లు బంద్.. ‘ఆశ’ సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలకు ఉచిత వైద్యం అందించే ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పథకానికి బ్రేక్ పడనుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన భారీ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, ఏప్రిల్ 1 (బుధవారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) ప్రకటించింది. ప్రభుత్వ తీరుపై హాస్పిటల్ యాజమాన్యాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

రూ. 3000 కోట్ల బకాయిలు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ‘ఆశ’ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సుమారు రూ. 3,000 కోట్ల మేర బకాయిలు పెట్టిందని, దీనివల్ల ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని వారు పేర్కొన్నారు. గతంలో సమ్మె చేసిన సమయంలో డిసెంబర్ నెలాఖరుకల్లా బకాయిలు చెల్లిస్తామని చంద్ర‌బాబు ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, మార్చి 31 వచ్చినా నిధులు విడుదల కాలేదని వారు మండిపడుతున్నారు.

వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరిట మోసం?
బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వన్ టైమ్ సెటిల్ మెంట్ విధానంపై ఆసుపత్రుల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నాయి. పాత బకాయిలు క్లియర్ చేయకుండానే కొత్త ఇన్సూరెన్స్ పాలసీలోకి వెళ్లాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని, ఇది ఆసుపత్రులను దగా చేయడమేనని ‘ఆశ’ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

సేవల నిలిపివేతతో పేదలకు కష్టాలు
బుధవారం నుండి ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద కొత్త అడ్మిషన్లు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని ఆసుపత్రుల సంఘం హెచ్చరించింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించే వ‌ర‌కు సామాన్య రోగులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment