అతిగా మద్యం (Alcohol) సేవించిన ఇద్దరు యువకులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషాదకర ఘటన అన్నమయ్య జిల్లా (Annamayya District) కే.వి పల్లి మండలంలో చోటుచేసుకుంది. కే.వి పల్లి మండలం బండవడ్డీపల్లి సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. గతంలో అన్నమయ్య జిల్లా ములకలచెరువులోనే నకిలీ మద్యం (Fake Alcohol) బయటపడిన విషయం తెలిసిందే.. దీంతో నకిలీ మద్యం కారణంగానే ఇద్దరు యువకులు మృతిచెందారా అన్న అనుమానం స్థానికంగా బలపడుతోంది.
స్థానికుల సమాచారం మేరకు, శనివారం సాయంత్రం ఆరుగురు యువకులు కలిసి మద్యం సేవించినట్లు తెలుస్తోంది. వీరు మొత్తం 19 బడ్‌వైజర్ బీర్లు తాగినట్లు సమాచారం. ఈ సమయంలో ఒక్కసారిగా 8:15 గంటల ప్రాంతంలో మణికుమార్ (Manikumar) అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని గర్నిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే అక్కడికి తీసుకెళ్లే మార్గమధ్యంలోనే మణికుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అదే సమయంలో మరో యువకుడు పుష్పరాజ్ (Pushparaj) కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని అత్యవసరంగా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పుష్పరాజ్ కూడా మృతి చెందాడు. మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని తెలుస్తోంది.
ఈ ఘటనపై కే.వి పల్లి ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నకిలీ మద్యం సేవించడమే యువకుల మృతికి కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఒకేసారి ఇద్దరు యువకులు మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతికి గల అసలు కారణాలు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడికానున్నాయని పోలీసులు తెలిపారు.
ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆకస్మికంగా చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.








