ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వం రైతులకు (Farmers) శుభవార్త చెప్పింది. ఈ నెల 19న రెండో విడత నిధులను జమ చేయనున్న నేపథ్యంలో, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) నిమ్మాడ క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, 26 జిల్లాల జేడీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ (PM-KISAN) నిధులు, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి ప్రతి రైతుకూ రూ.7,000 అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) 19న వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో, సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. NPCAలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయడం, రైతుల డెత్ మ్యూటేషన్లను వెంటనే ప్రాసెస్ చేయడం, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడం వంటి అంశాలపై కూడా స్పష్టమైన దిశా నిర్దేశాలు ఇచ్చారు.
రెండో విడతలో మొత్తం 46,62,904 మంది రైతులు లబ్ధి పొందనున్నారని అధికారులు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ (Annadata Sukhibhava – PM-KISAN) పథకాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 3,077.77 కోట్లు విడుదల చేసి, నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి.








